Friday 10 June 2016

కామన్‌స్కూల్‌

UTFWG:  
09/06/2016
Telugu News >> ఆంధ్రజ్యోతి >> Editorial

💰💰కాసుల చదువుల మధ్య కామన్‌స్కూల్‌ కల✏📒

మౌలిక వసతుల కల్పన పేరుతో రోడ్ల మీద రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు కడతారు కానీ, అన్నిటికంటె కీలకమయిన మౌలిక సదుపాయాలు విద్య, ఆరోగ్యం- అన్న గుర్తింపు ఉండదు. ఈ రెండు రంగాలను కూడా మార్కెట్‌కు వదిలివేసి, దేశభవిష్యత్తును ప్రమాదంలో పడవేశాయి ఇటీవలి ప్రభుత్వాలు. కమ్యూనిటీ కనుసన్నలలో మంచి చదువులు కామన్‌స్కూళ్లలోనే సాధ్యం. సర్కారుబడులు గతంలో అవే పనిచేశాయి. వాటిని పటిష్టమూ సుస్థిరమూ చేయడం ద్వారానే ఇప్పుడు కూడా ఆ కలను నెరవేర్చుకోవచ్చు. భారత్‌కు పొరుగున ఉన్న అతి చిన్న దేశం భూటాన్‌. రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి శీఘ్ర పరివర్తనలో ఉన్నది. పదకొండో తరగతి దాకా అందరికీ నాణ్యమయిన ఉచిత విద్య అందించడం ఆ దేశ విద్యావిధానంలో ఒక ముఖ్యమయిన అంశం. హైయర్‌ సెకండరీ విద్య దాకా చదువు చెప్పే ప్రభుత్వ స్కూళ్లు ఆ దేశంలో 1300 ఉంటే, ప్రైవేటు స్కూళ్లు 24 మాత్రమే ఉన్నాయి. స్థానిక భాష జోంఖా, ఇంగ్లీషు, లెక్కలు- ఈ మూడు ఆ దేశ విధానకర్తలు ప్రధానంగా భావించిన విద్యాంశాలు. పదకొండో తరగతి ముగిసే నాటికి జోంఖా భాషలో వ్యవహారిక, పరిపాలనా, సాహిత్య అవసరాల కోసం చదవడం, రాయడం విద్యార్థులకు రావాలి. ఇంగ్లీషులో మాట్లాడడం రావాలి. ప్రభుత్వ కార్యాలయాలలో జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిలో లెక్కలు చేయగలగాలి. టూరిజం ఒక ప్రధాన ఉపాధి అయిన ఆ దేశంలో సంబంధిత వృత్తుల్లో ఉన్న యువతీయువకులు అవసరమైన మేరకు ఇంగ్లీషు మాట్లాడగలరు. భారత సినిమాలు, టీవీల ప్రభావంతో హిందీ కూడా మాట్లాడగలరు. అదనంగా కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుని ఉద్యోగాలూ సంపాదించుకోగలరు. ఉన్నత విద్యకు అవకాశాలు ఆ దేశంలో పరిమితమే అయినప్పటికీ, హైస్కూలు విద్య ఆ సమాజానికి ఈ దశలో కావలసిన కనీస మానవవనరులను అందించడంతో పాటు, ఒక స్థాయి ఉపాధిని గ్యారంటీ చేస్తున్నది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోత విధించి అయినా సరే విద్యా వ్యాప్తి సార్వత్రకం చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని ఆ దేశ పాలకులు భావిస్తున్నారు. ఆ దేశంలో సంతోషపు సూచిక ఉచ్ఛస్థాయిలో ఉండడానికి సార్వజనీన విద్య కూడా ఒక కారణం. ప్రపంచంలో అతిబలశాలి రాజ్యంగా ఉన్న అమెరికాలో కిండర్‌గార్టెన్‌ నుంచి 12వ తరగతి దాకా ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉచిత విద్య అందించే పబ్లిక్‌ స్కూళ్లలో అయినా, ప్రైవేటునిధులతో ఫీజులతో నడిచే స్కూళ్లలో అయినా చదివించవచ్చు. అత్యధిక అమెరికన్‌ విద్యార్థులు పబ్లిక్‌స్కూళ్లలోనే చదువుతారు. పబ్లిక్‌స్కూళ్లలో విద్య అత్యంత నాణ్యంగా ఉంటుంది. ప్రపంచంలో విద్యార్థుల మీద అత్యధికంగా తలసరి వ్యయం చేసే దేశం అమెరికా. ఆ దేశంలో చాలాచోట్ల పబ్లిక్‌స్కూళ్లు స్థానికసంస్థల పన్నుల ఆదాయంతోనే నడుస్తాయి. 12వ తరగతి తరువాత ఉన్నత విద్య ఆ దేశంలో అత్యంత ఖరీదు, అది వేరే విషయం. ఒక పెద్ద దేశం, అతి చిన్నదేశం - రెండూ చదువుని అంత ముఖ్యమయినవిగా భావిస్తుంటే, భారతదేశం ఎందుకు విద్యారంగాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నది?ప్రభుత్వం ద్వారా ఉచిత విద్య ఇక్కడ కూడా లభిస్తున్నది. పదకొండో పన్నెండో తరగతుల వరకే కాదు, ఇంజనీరింగులూ పీహెచ్‌డీలకూ కూడా నిధులు అందిస్తున్నది. కానీ, పునాది విద్య ఎందుకు కునారిల్లిపోయింది? పదోతరగతి తరువాత చదువు నుంచి జారుకుంటున్న వారి సంఖ్య ఎందుకు అధికంగా ఉంటున్నది? ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యపు ఊబిలో తోసేసి, ప్రైవేటు విద్యారంగానికి ఎందుకు వత్తాసు పలికింది? పోనీ ఆ ప్రైవేటు రంగమయినా నాణ్యమయిన, సర్వతోముఖమయిన విద్య అందించే విధంగా నియంత్రణ ఎందుకు చేయడం లేదు? ఈ ప్రశ్నలు విషాదకరమయినవి. కొత్తగా ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన వ్యక్తి అప్పుడే నిద్రలేచినట్టు, ఆడపిల్లలకు టాయిలెట్లు లేని పాఠశాలలు ఉండడమేంటి అని ఆశ్చర్యపోతాడు, ఈ దేశంలో ఇంత చెత్త ఉన్నదేమిటీ అని గుండెలు బాదుకున్నట్టు. ఈ విధ్వంసంలో అధికారంలో ఉన్న పార్టీలే కాదు, ప్రతిపక్షాలుగా చట్టసభలలో పాలుపంచుకున్న అందరికీ పాత్ర ఉన్నది. ఉచితంగా ఇస్తే చాలదు, ఆ విద్య నాణ్యంగా ఉండాలి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని వివిధ హోదాలలో దేశపాలనలో, సమాజరంగంలో పాత్ర నిర్వహిస్తున్నవారు ఇంకా దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు. ఎందరో మేధావులను, రచయితలను, సంఘసేవకులను, రాజకీయవేత్తలను అందించిన ప్రభుత్వ పాఠశాలలు నాణ్యత లేనివిగా ఎట్లా మారాయి? ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎట్లా ఖాయిలా పడ్డాయో అట్లాగే, స్కూళ్లూ శిథిలమయ్యాయి. ఇప్పటికీ, మారుమూల పల్లెటూళ్లలో, గిరిజన గూడేలలో, కాలినడకన వెళ్లి పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. పాఠశాలల నిర్వహణే జీవితంగా చదువుదీపాన్ని వెలిగించడానికి తాపత్రయపడుతున్న హెడ్మాష్టర్లూ ఉన్నారు. ఒకరో ఇద్దరో పదిమందో బాధ్యతారహితులు ఉండవచ్చు, కానీ, మొత్తం మీద ఉపాధ్యాయ వృత్తిని సీరియ్‌సగా తీసుకునే గురువులే, పిల్లలు ఎదిగి పెద్దవారయితే సంబరపడే గురువులే విరివిగా కనిపిస్తారు. కానీ, వారి తపనకు ఆలంబన ఏదీ? వ్యవస్థాగతమయిన వనరులు ఏవీ? ప్రభుత్వస్కూళ్ల మీద అపప్రథ వ్యాపిస్తుంటే, ప్రైవేటు విద్యాసంస్థల వ్యాప్తి కోసం పాలకులు దానిని అనుమతించారు. ప్రైవేటు విద్యకు వలసవెళ్లినవారు పోగా, బడుగు బలహీనులు ప్రభుత్వస్కూళ్లలో మిగిలిపోయారు. ప్రైవేటీకరణలో బాధితులు వారే. ఉచిత విద్య మీద ఖర్చు తగ్గించాలి. టీచర్ల సంఖ్య తగ్గించాలి. కొత్త నియామకాలు చేయకూడదు... ఇటువంటి ఆదేశాలను ప్రపంచప్రభువుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టిన తరువాత, స్కూళ్ల పరిస్థితి మరింత దిగజారింది. ప్రాథమిక, సెకండరీ విద్యల  సంగతి సరే, ఉన్నత విద్యకు ప్రభుత్వ పెట్టుబడులు మరింత తగ్గించాలి. చదువును కూడా ఒక వ్యాపారసేవగా గుర్తించాలి. విదేశీ విద్యాసంస్థల వ్యాపారం కోసం ప్రభుత్వ విద్యాసంస్థల నిధులను, ప్రతిష్ఠను దిగజార్చాలి. ఇవి ఇటీవలి పరిణామాలు. కావాలంటే, మొన్న డిసెంబర్‌లో నైరోబీలో ఏమి జరిగింది, నిర్మలా సీతారామన్‌ ఏ అంశాల్లో రాజీపడి వచ్చారో తెలుసుకోండి. ఇక్కడ చదువుకున్నవారిని చవకగా ఎగరేసుకుపోవడం మొన్నటి దాకా చూశాం, అది బ్రెయిన్‌ డ్రెయిన్‌ అనుకున్నాం. ఇప్పుడు, ఇక్కడ చదువుచెప్పేపని కూడా వారే తీసుకుంటారు. ప్రభుత్వ విద్యను పునాదిలోనే దిగజార్చడం మొదలుపెట్టిన దశకు, ఇప్పుడు ఉన్నత విద్యను నిశ్శబ్దంగా హత్య చేస్తున్న దశకు మధ్యలో జులాయి విద్యా సంస్థలు ఎగుమతి ఆధారిత విద్యతో తెగ సొమ్ము చేసుకున్నాయి. కాంట్రాక్టర్ల తరువాత ఇప్పుడు హవా విద్యాసంస్థ యజమానులదే. రాజకీయాలలోనూ వారికిప్పుడు ఉచ్ఛదశ ప్రాప్తించింది. ఉన్నత విద్యను గ్లోబలైజ్‌ చేసే ప్రక్రియకు అనుబంధంగా ఇప్పుడు మొత్తం విద్యావిధానాన్ని ఏకరూపంగా మార్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. మూల్యాంకన పద్ధతులు, సిలబ్‌సలు అన్నీ మారిపోతున్నాయి. కొద్దోగొప్పో బాధ్యత కలిగిన పాత చదువులు చదివిన వారిలో ఆ విద్య చైతన్యంగానో సామాజిక అవగాహనగానో మారుతుంటే, దానిని ఉక్కుపాదంతో అణచివేయడానికి యూనివర్సిటీల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థల ఉధృతికి మరో కారణం ఇంగ్లీషు మాధ్యమం. ఉపాధికి, సాధికారతకు కూడా ఇంగ్లీషే మార్గమని భావించే వారిని తప్పుపట్టలేము. శుష్క భాషాభిమానంతో మాతృభాషలను కాపాడుకోలేము. ప్రజల ఆకాంక్షను, మాతృభాషల రక్షణను రెంటినీ సమన్వయం చేసే పరిష్కారాలను వెదికే తీరిక ప్రభుత్వాలకు లేదు. మౌలిక వసతుల కల్పన పేరుతో రోడ్ల మీద రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు కడతారు కానీ, అన్నిటికంటె కీలకమయిన మౌలిక సదుపాయాలు విద్య, ఆరోగ్యం- అన్న గుర్తింపు ఉండదు. ఈ రెండు రంగాలను కూడా మార్కెట్‌కు వదిలివేసి, దేశభవిష్యత్తును ప్రమాదంలో పడవేశాయి ఇటీవలి ప్రభుత్వాలు. విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, కొత్తగా తీర్చిదిద్దుకోవడానికి కొత్తరాష్ట్రంగా తెలంగాణకు అవకాశం లభించింది. వివక్ష వల్ల ఏర్పడిన వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు సార్వజనీనమయిన, నాణ్యమయిన విద్యను అందించడం ఒక నమ్మదగిన మార్గం. కామన్‌స్కూల్‌ తన కల అని కేసీఆర్‌ చెప్పుకున్నారు. కమ్యూనిటీ కనుసన్నలలో మంచి చదువులు కామన్‌స్కూళ్లలోనే సాధ్యం. సర్కారుబడులు గతంలో అవే పనిచేశాయి. వాటిని పటిష్టమూ సుస్థిరమూ చేయడం ద్వారానే ఇప్పుడు కూడా ఆ కలను నెరవేర్చుకోవచ్చు. వందో రెండువందలో గురుకుల పాఠశాలలు ప్రారంభించడం 'కేజీ టు పీజీ ఉచిత విద్య'కు ప్రత్యామ్నాయం కాదు. పాఠశాలలకు కావలసిన భౌతికవనరులన్నీ సమకూర్చాలి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలి. స్కూళ్లను మూసివేయడం నిలిపివేయాలి. ఒకనాడు ప్రభుత్వ స్కూళ్లకు సమకూరిన వనరులను ఇప్పుడు వాణిజ్య అవసరాలకు మళ్లించాలనుకునే దుర్బుద్ధి మానుకోవాలి. విద్యావ్యాపారాన్ని కఠినంగా నియంత్రించాలి. విద్యారంగం మీద అధికార రాజకీయాల నీలినీడలను పారదోలాలి. అన్నిటికి మించి, చదువుల రంగాన్ని - అక్రమాదాయాల వనరుగా చూడడం ఏలికలు మానుకోవాలి. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల మీద నిర్ణయం తీసుకుంటే, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. మన సమాజానికి ఎటువంటి విద్య అవసరమో, అటువంటి విద్యను కరికులమ్‌లో పొందుపరచాలి. ఇందుకు కేవలం రాజకీయ సంకల్పం, బ్యూరోక్రటిక్‌ ఆచరణా సరిపోవు. యావత సమాజాన్ని కలుపుకుని, విద్యారంగ నిపుణుల సూచనలు తీసుకుని, క్షేత్రస్థాయి వాస్తవికతను, అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికారచన చేయాలి.రెండు సంవత్సరాలు గడచినా, ఆ దిశగా ఒకటిరెండు అడుగులు కూడా పడకపోవడం విషాదం.

No comments:

Post a Comment